Wednesday, August 12, 2015

ఇనుప కచ్చడాలు

అక్షరాల్లో ఉగ్రవాదం..
అణువణువూ మనువాదం..
కలాల నిండా కాషాయం నింపుకోండి..
ఆలోచన చెవిలో కమలం పెట్టండి..

బ్యాన్ ఎవ్రీథింగ్.. అశ్లీలాన్నే కాదు
అసలు శృంగారాన్నే నిషేధించండి
ఆడోళ్లంతా బుర్ఖాలేసుకోండి..
అవసరమైతే ఇనుప కచ్చడాలు బిగించండి..

మగాళ్లంతా కరసేవకులై కదలండి
మానవహక్కులన్నవాళ్లని కాల్చేయండి..
ఒక్క గోద్రా సరిపోదు..
ప్రతీరాష్ట్రం గుజరాత్ కావాలి..

ఇంకా అర్ధం కానిదొక్కటే..
కన్నుకుకన్ను పీకడానికి చట్టమెందుకు..
ఊరికో తలారినుంచండి..
రోజుకో ఉరి తీయండి..

సెల్ఫీ..

జనాలకు పుణ్యం కావాలి..
సీఎం గారికి సెల్ఫీ కావాలి..
నీళ్లకేం తెలుసు పాపమో పుణ్యమో..
నరబలిచ్చేశారుగా..
దారమ్మ హ్యప్పీ..!
హత్యలకి పరిహారం ప్రకటించేశారు..
పాపపరిహారంగా నిత్యహారతి పడుతున్నారు..
తొక్కిసలాటలో న్యాయం చచ్చిపోయిందిగా..
పుష్కరఘాట్లలోనే సెల్ఫీ దర్జాగా తిరుగుతోంది.!
(కవిసంగమంలో జులై 16,2015 నాడు పోస్ట్ చేసిన కవిత)

కృష్ణంవందే..

రాత్రి నల్లమందు మింగినట్టుంది.. 
గాలిలో గంజాయి కలిసినట్టుంది.. 
విశ్వమంతా నిషాలో తూగుతుంటే.. 
శరీరం ఎక్కడికో తేలిపోతుంటే.. 
వెలుగులో ఏముంది.. 
శరీరాల్ని కుర్చీలకు కుదువ పెట్టడం తప్ప.. 
చీకటికి స్వాగతం చెప్పండి.. 
కాసేపు మత్తులో మునిగిపోండి.. 
నిషా కోసం సీసా మూత విప్పొద్దు.. 
ఒట్టొట్టి కషాయాలతో సర్దుకుపోవద్దు.. 
నల్లని కురుల్లో ఓపియం ఉంటుంది వెతుక్కోండి.. 
కనుపాపల్లో ఉబికే హెరాయిన్ గుట్టు కనుక్కోండి.. 
జస్ట్ లైట్స్ ఆఫ్.. 
కృష్ణం వందే జగద్గురుం

Tuesday, March 03, 2015

ఇడా-బ్లాక్ అండ్ వైట్ లైఫ్

విశ్వంలో ఎన్నో రంగులు.. ఒక్కో వర్ణానిది ఒక్కో అందం. ఎన్ని రంగులున్నా శాశ్వతమైనవి రెండే.. బ్లాక్ అండ్ వైట్. పగలు-రేయి. స్వేచ్ఛ(వెలుగు)-చీకటి. సవాలక్ష రంగులతో నిండిన జీవితాలు కొన్ని. బ్లాక్ అండ్ వైట్ బతుకులు ఇంకొన్ని. యుద్ధం రంగుల్ని మింగేస్తుంది. మనుషుల్ని జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది. యుద్ధంలో చస్తే స్వర్గానికెళ్తారంటారు.. ఇది నిజమే. ఎందుకంటే బతికినవాడిది నరకం కాబట్టి. రెండో ప్రపంచయుద్ధం పోలండ్ ను ఇలాగే మార్చింది. ముఖ్యంగా యూదుల బతుకుల్ని(దానికి ప్రతీకారంగా ప్రపంచానికిప్పుడు వాళ్లుకూడా నరకం చూపిస్తున్నారనుకుంటా.). నాటి పోలండ్ గురించి ఈ ఇంట్రో సరిపోదేమో. అందుకే సినిమా తీశాడు పాలికోవ్ స్కీ. బ్లాక్ అండ్ వైట్ లో.. యుద్ధం తర్వాత పోలండ్ ఏంటన్నది 80నిమిషాల్లో చెప్పాడు. రెండు రంగులు.. రెండున్నర పాత్రలు(ఇంకా కొన్ని ఉన్నాయి కానీ లెక్కలోకి రావు. ఇడా లవర్ కొద్ది సేపే ఉంటాడు, అందుకే సగం కింద లేక్కేశా). ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్. వాండా(ఇడాకు ఆంటీ) ఆత్మహత్య. ఉదయాన్నే లేచి.. మంచిగా ఫ్రెషప్ అయి, కిటికీలన్నీ తెరచి, గ్రామ్ ఫోన్ రికార్డ్ ఆన్ చేసి.. పాటలు వింటూ తెరచిన కిటికీలోంచి కిందకు దూకేస్తుంది. సింపుల్గా అనిపించినా దీన్ని పిక్చరైజ్ చేసిన విధానం మాత్రం సూపర్బ్. నచ్చిన సెకండ్ సీన్.. వాండా ఆత్మహత్య తర్వాత కాన్వెంట్ నుంచి తిరిగొచ్చే ఇడా.. నన్ క్యాప్ తీసేసి, ఫుల్లుగా మందుకొట్టి, తన లవర్ తో ఎంజాయ్ చేశాక. తనని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. తర్వాత ఏంచేద్దామని అడిగితే... బీచ్ కెళ్దామంటాడు... తర్వాత పెళ్లి.. పిల్లలు అంటాడు. చివరకు చెప్పడానికేమీ లేక యాజ్ యూజువల్ లైఫ్ అని ముగిస్తాడు.. కాసేపటి తర్వాత ఇడా లేచి సన్యాసి డ్రస్ వేసుకుని కాన్వెంట్ కు బైల్దేరుతుంది. తను నడుస్తూ ఉండగా ఎండ్ క్రెడిట్స్ మొదలవుతాయి. ఇంకా బాగా నచ్చినవి.. బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ప్రతీ లాంగ్ షాట్. ఈసినిమాకి ఆస్కార్ రావడానికి యూదు బ్యాగ్రౌండ్ కారణమనుకున్నా.. ఇంతకన్నా బెస్ట్ గా మరోదాన్ని కూడా చూడలేం.

Friday, February 24, 2012

చాన్నాళ్ల తర్వాత ఏడ్చాను...

చాన్నాళ్ల తర్వాత ఏడ్చాను... మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మసకమసగ్గా నా బాల్యం కనిపించింది. కర్ర ఊతంతో, కనిపించీ కనిపించని చూపులతో మా ఇంటివైపు నడిచొచ్చే మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మామ వాళ్లింట్లో కోళ్ల గంపల కింద నుంచి గుడ్లు పగులగొట్టి తాగిన రోజులు గుర్తొచ్చాయి. మందలించలేక నవ్విన లక్ష్మమ్మ, మా అమ్మమ్మ నవ్వు గుర్తొచ్చింది. కానీ ఆమె చావు సమయంలో ఎక్కడో దూరంగా చదువుకుంటున్న రోజులన్నీ కళ్లముందు కదిలాయి.

ది వే హోమ్... అద్భుతమైన సినిమా. ఈ మధ్య కాలంలో చూసిన ది బెస్ట్ మూవీ. కొరియన్ సినిమా. లీ జియోన్ హ్యాంగ్ దర్శకత్వంలో అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ క్యాస్టింగ్‌తో తీశారు. బహుశా ఎంత తక్కువ ఖర్చుతో సినిమా తీస్తే... అంత హృద్యంగా సినిమా తీయొచ్చేమో. ఎప్పుడో వదిలేసిన తల్లి దగ్గరకు 9 ఏళ్ల కొడుకుతో వస్తుంది కూతురు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోతుంది. దూర దేశంలో ఉద్యోగం వస్తుంది. అక్కడికి వెళ్లాలంటే కొడుకును ఏం చేయాలి. తల్లి దగ్గర కొడుకును విడిచిపెట్టి వెళ్లిపోతుంది. పూర్తి పట్టణ వాసంలో, కాస్త విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కుర్రాడు. బస్సు సౌకర్యం కూడా అంతంతమాత్రంగా ఉన్న గ్రామంలో, పూర్తిగా గ్రామీణ జీవితానికి అలవాటుపడి పండుటాకులా ఉన్న అమ్మమ్మ. వీరిద్దరి మధ్య పొంతన కుదరదు. అమ్మమ్మను చూస్తేనే అసహ్యించుకుంటాడా కుర్రాడు. కానీ అద్భుతమైన ప్రేమను పంచుతుందా అమ్మమ్మ. సినిమా సాగేకొద్దీ ఇద్దరి మధ్య ఎటాచ్‌మెంట్ పెరుగుతుంది. సినిమా చివరకు వస్తున్న కొద్దీ మన కళ్లవెంట నీటిధార మొదలవుతుంది. చివర్లో తల్లి వచ్చి కుర్రాడ్ని తీసుకెళ్లే సమయంలో మనల్ని మనం మర్చిపోతాం. చిన్నప్పుడు అమ్మమ్మ ఒడిలో కూర్చుని ఏడ్చినట్టే ఏడ్చేస్తాం. కర్చీఫ్ తీసుకోవడం కూడా మర్చిపోతాం.

సినిమా స్లోగా, కదిలించేలా సాగుతుంది. కేవలం గంటన్నర మూవీ. కుటుంబం మొత్తం కలిసి చూస్తే బావుంటుంది. ఈసినిమా కాపీ చేసి ఇంటికి తీస్కెళ్లాలి. మొన్నోసారి విహారి ఫోన్‌లో ఈ సినిమా చూడమన్నాడు. వాళ్ల తాతయ్య చనిపోయాడని చెప్తూ ది వే హోమ్ గురించి చెప్పాడు. థ్యాంక్స్ విహారి.

Wednesday, December 28, 2011

మునెమ్మ:ఓ స్త్రీశక్తి

నిన్న రాత్రి మునెమ్మ చదివాను. కేశవరెడ్డి గత నవలలతో పోలిస్తే... పూర్తిగా కొత్త శైలి. రెడ్డి పుస్తకాలలో నేను చదివిన తొలి నవల అతడు అడవిని జయించాడు. మునెమ్మలో ప్రత్యేకత ఏంటంటే... ఒకసారి చదవడం ప్రారంభింస్తే, పూర్తయ్యాకే ఆపగలం. కథనం ముందు వెనకలకు ఊగిసలాడుతూ ఉంటుంది. మనం ఏకబిగిన చదవాల్సిందే. అక్కడా వస్తుగతమైన సమస్యలు ఉన్నాయి. అయితే నవల చదివినంత సేపూ వాటి పైకి వెళ్లలేం. బుక్ ముగిశాక మునెమ్మ మాత్రమే గుర్తుంటుంది. మునెమ్మలో అన్నింటి కంటే ఆసక్తికర విషయం.... మనిషికీ, జంతువుకీ మధ్య లైంగిక సంబంధం. దీనిపై విస్తృతమైన చర్చే జరిగింది. ఈ మధ్య కాలంలో ఇలా ఏ నవలపై ఇంత చర్చ జరగలేదని చెప్పుకోవచ్చు. నిజానికి నవలలో జయరాముడి ఆవేశానికి కారణంగా ప్రారంభమై, చివరకు బొల్లిగిత్తలో జయరాముడ్ని మునెమ్మ చూసుకోవడం వరకే పరిమితమైన విషయం. మిగిలిన కథంతా మునెమ్మ సాహసయాత్రే.

Monday, January 10, 2011

ఇన్నోసెన్స్ ఈజ్ బ్రూటల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఇన్ దిస్ వరల్డ్

అమాయకత్వంతో ప్రపంచం ఆటాడుకుంటుంది... ఇన్నోసెన్స్ ఈజ్ బ్రూటల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
తనువెల్లా అమాయకత్వం పులుమకుని సాత్ సముందర్ పార్... అంటూ తెరపై కనిపించిన దివ్యభారతి ఇప్పటికీ కళ్ళముందు మెదులుతుంటుంది. ఐయామ్ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దివ్య ఇన్ మై సెవెంత్ స్టాండర్డ్. బొబ్బిలిరాజా సినిమా చూశాను. రెండు రోజులపాటు దివ్య గుర్తుండిపోయింది. నాకంటే కాస్త వయసులో పెద్దదై ఉండొచ్చు. కానీ సినిమా ప్రపంచంలో అంతచిన్న వయసుకే హీరోయిన్. వాటే ట్రాజడీ...
ప్రపంచాన్ని పాఠాలుగా చదువుకోవాల్సిన వయసులో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది దివ్య. అసమానమైన ఆమె అందం ముందు సక్సెస్ మోకరిల్లింది. దాంతోపాటే వంచన, మోసం, డబ్బుకోసం మనుషుల కక్కుర్తి... దివ్యకు చేదు పాఠాలుగా ఎదురయ్యాయి. పైగా సాజిద్‌తో వివాహంలోనూ ఇబ్బందులు. దివ్య చనిపోయిన ఘటన ఇప్పటికీ కళ్ళు చెమర్చేలా చేస్తుంది. మృతి వెనుకా అన్నీ అనుమానాలే...
రియల్లీ... ఇన్నోసెన్స్ ఈజ్ బ్రూటల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఇన్ దిస్ వరల్డ్.