Wednesday, April 14, 2010

సముద్రగర్భ సమాధిపై మాసిపోని అక్షరాలు... టైటానిక్

టైటానిక్... సముద్రగర్భ సమాధిపై మాసిపోని అక్షరాలివి. నౌకాయానంలో అతిపెద్ద విషాదంగా చెప్పుకునే టైటానిక్ ఓడ మునిగిపోయి నేటితో 98 ఏళ్ళు.

మానవచరిత్ర పుటల్లో మృత్యువు పులుముకున్న రక్తాక్షరాలదే అగ్రపీఠం. గతాన్ని తవ్వేకొద్దీ తడి ఆరని స్మృతులే గుట్టలుగా బైటపడ్తుంటాయి. ఆ తడి సముద్రమంత ఉప్పెనైతే... ఆవిషాదం పేరు టైటానిక్. అవును ప్రపంచ నౌకాయాన చరిత్రలో టైటానిక్‌ది అతిపెద్ద విషాదం. విలాసంలోనూ, సౌకర్యంలోనూ , ప్రయాణికుల కెపాసిటీలోనూ ప్రత్యర్ధి నౌకల్ని పక్కకునెట్టిన ఈ అతిపెద్ద ఓడ... విషాదంలోనూ దేనికీ అందనంత లోతులో నిలిచిపోయింది.

20వశతాబ్దపు తొలినాళ్ళలో నౌకాప్రయాణమంటే... సాహసమే. ఇలాంటి వాతావరణంలో... స్విమ్మింగ్ పూల్, వ్యాయామశాల, టర్కిష్ బాత్, లైబ్రరీ, స్క్వాష్‌కోర్టులతో తయారైన టైటానిక్ పెనుసంచలనాన్నే సృష్టించింది. వైట్ స్టార్ లైన్ సంస్థకోసం, హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకానిర్మాణ సంస్థ తయారుచేసిన మూడునౌకల్లో ఇది ఒకటి. 1912లో మొదటిసారిగా దీనిని ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలో ఇదే అతిపెద్దనౌక. అప్పటికి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టైటానిక్ తయారయింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటీఆవిరితో నడిచే జనరేటర్లు, శక్తివంతమైన రెండు మార్కొని రేడియో సెట్లు... సూటిగా చెప్పాలంటే అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమే టైటానిక్.

నిర్మాణపరంగా సంచలనం సృష్టించిన టైటానిక్ తొలిప్రయాణం 1912 ఏప్రిల్ 10న ప్రారంభమైంది. ఎడ్వర్డ్ జె. స్మిత్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు నౌక ప్రయాణం మొదలైంది. ప్రయాణం ఆదిలోనే అపశకునం... భారీ ప్రొపెల్లర్‌‌లు విడుదలచేసిన శక్తి... పక్కనే లంగరు వేసున్న న్యూయార్క్ లైనర్‌ను కట్లు తెంచుకునేలా చేసింది. మీదికొస్తున్న ఆఓడను సిబ్బంది సకాలంలో గుర్తించడంతో ప్రయాణం మొదట్లోనే పెనుప్రమాదం తప్పింది. ఎట్టకేలకు గంట అలస్యంగా టైటానిక్ ఫస్ట్ అండ్ లాస్ట్ టూర్ మొదలైంది.

ఇంగ్లీష్‌ఛానల్‌ను దాటాక ఫ్రాన్స్ చెర్‌బోర్గు దగ్గర ఆగిమరీ ప్రయాణికుల్ని ఎక్కించుకుంది. మొత్తం 2240మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు బైల్దేరింది. ప్రయాణంలో నాలుగురోజులు గడిచాయి. ఏప్రిల్ 14ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. ముంచుకొస్తున్న ముప్పు గురించి తెలియని సముద్రుడు నిశ్చలంగా ఉన్నాడు. ఇక ఓడలోని ప్రయాణికులది పండగవాతావరణమే. మత్తెక్కించే వాయిద్యాల హోరులో అంతా పార్టీ మూడ్‌లో ఉన్నారు.

మంచు కొండల గురించి అంతకుమందు రోజునుంచి వస్తున్న వైర్‌లెస్ సమాచారంతో... కెప్టెన్ స్మిత్, నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్లించమని ఆదేశించాడు. అయితే టైటానిక్ వెళ్లే దారిలో మంచు పర్వతాలు ఉన్నాయంటూ... వచ్చిన హెచ్చరికలు మాత్రం నౌకను నియంత్రించే బ్రడ్జి గదికి చేరలేదు. రాత్రి 11.40 సమయంలో న్యూఫౌండ్ ల్యాండ్స్ సమీపంలోని గ్రాండ్ బ్యాంక్స్ దగ్గర ఓ భారీ మంచు పర్వతాన్ని టైటానిక్ ఢీకొంది. మంచుపర్వతాన్ని ముందుగానే గమనించి పక్కకు మళ్ళించే లోపే ప్రమాదం జరిగిపోయింది. టైటానిక్ మంచుపర్వతాన్ని ఎంత వేగంగా గుద్దుకుందంటే... ఆరాపిడికి నౌక కుడిభాగం నిర్మాణంలో వాడిన రివెట్లను బైటపడేసింది.

అప్పటివరకూ టైటానిక్‌లో పండుగ వాతావరణంలో ఉన్న ప్రయాణికులను ఒక్కసారిగా ప్రాణభయం కమ్ముకుంది. సముద్రమపు నీరు ముందుభాగపు గదులను నింపేయడం మొదలయింది. నాలుగుకంపార్టుమెంట్లు నీటితో నిండినా టైటానిక్ తేలగలిగి ఉండేదేకానీ... ఐదో కంపార్ట్‌మెంట్ కూడా నీటితో నిండిపోవడంతో నౌకను పూర్తిగా ఆపమని కెప్టెన్ స్మిత్ ఆదేశించాడు. అర్ధరాత్రి తరువాత... ప్రాణాలు కాపాడుకునేందుకు లైఫ్‌బోట్లను సిద్ధంచేశారు. మరోవైపు బైటనుంచి సహాయంకోసం వైర్‌లెస్ మెసేజ్‌లు పంపించారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్‌పర్ట్, ఒలంపిక్ నౌకలు ఆసమయంలో చాలా దూరంలో ఉన్నాయి. దగ్గర్లో ఉన్న ఏకైక ఓడ కర్పతియా... టైటానిక్‌ను చేరుకునేటప్పటికే ఆలస్యమైంది.

టైటానిక్ సముద్రగర్భంలో మునిగిపోయింది. సముద్రం ఎదలో అలవాటైన నిశ్శబ్దం శ్మశానవాతావరణాన్ని పులుముకుంది. మొత్తం ప్రయాణికుల్లో 706మంది మాత్రమే ప్రాణాలతో కర్పతియాఓడ పైకి చేరుకోగా 1517మంది టైటా‌నిక్‌తోపాటు జలసమాధి అయ్యారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది థర్డ్ క్లాస్ ప్రయాణికులే కావడం విశేషం. ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల్లో 60శాతం మంది ప్రాణాలతో బైటపడగా సెకండ్ క్లాస్‌లో 41శాతం బతికిబైటపడ్డారు. సిబ్బందిలో 23శాతం మంది మాత్రమే ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. కళాకారులు, పోస్టల్ సిబ్బందిలో ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. ఇక దేశాలపరంగా చూస్తే ఎక్కువ శాతం మృతులు బ్రిటన్‌కు చెందిన వారే. ప్రపంచంపై అప్పటికీ గుత్తాధిపత్యంచేస్తున్న బ్రిటిషర్లు ఇక్కడ చావులోనూ తమదే పైచేయన్నారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మహిళలు, చిన్నపిల్లలు, విదేశీయులకే మొదటి అవకాశం ఇవ్వాలంటూ... బ్రిటన్ హోదాను కాపాడండంటూ నౌకకెప్టెన్ స్మిత్ తన దేశీయులనుకోరడం విశేషం. ప్రయాణం ప్రారంభమైన సౌతాంప్టన్‌లోని వెయ్యి కుటుంబాల్లో ఈదుర్ఘటన కోలుకోలేని విషాదాన్ని నింపింది.
టైటానిక్ జలసమాధి అయిన మూడవరోజు బాధితులతో నిండిన కర్పతియా నౌక న్యూయార్క్ చేరుకుంది. ప్రాణాలతో బైటపడినవారి ముఖాల్లో మృత్యువును జయించిన ఆనందం కంటే... సహచరుల త్యాగపూరిత మరణాల నీడలే కమ్మేశాయి. టైటానిక్ విషాదాంతం తర్వాత ఈకధాంశంతో బోలెడు నవలలు పుట్టుకొచ్చాయి. ఇక సినిమాల సంగతి సరేసరి. అయితే వీటన్నింటిలోనూ ఈ విషాదానికి 75ఏళ్ళు నిండిన సందర్భంగా జేమ్స్ కేమెరాన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ ప్రపంచసినిమాకు మేకింగ్ టెక్నిక్స్ నేర్పింది. 1912నాటి దుర్ఘటనలో నిండిన త్యాగాలకు అద్భుతమైన ప్రేమకథను జోడించడంతో ప్రపంచమొత్తం టైటానిక్‌కు నీరాజనం పట్టింది.

టైటానిక్ మునిగిపోయిన కొద్దికాలానికే దాని అవశేషాలను సముద్రగర్భంనుంచి బైటకు తీసుకురావాలని ఆలోచనలు చేశారు. అయితే 1985 సెప్టెంబర్ వరకూ ఆ ఆలోచనలు అమల్లోకి రాలేదు. ఎట్టకేలకు వోడ్స్ హోల్ సంస్థ ఆధ్వర్యంలో.. సముద్ర గర్భంలో 2మైళ్లలోతున నౌక అవశేషాలను కనుగొన్నారు. చరిత్రకు విషాదాన్ని పంచిన టైటానిక్ నౌకాయానానికి మాత్రం సరికొత్త పాఠాలు నేర్పింది. నౌకాయానంలో బూజుపట్టిన రూల్స్‌ స్థానంలో సరికొత్త నియమావళి అందుబాటులోకి వచ్చింది.

ఏమైతేనేం... టైటానిక్ సముద్రగర్భసమాధిపై మాసిపోని శిలాఫలకం... మానవచరిత్ర పుటల్లో తడి ఆరని స్మృతి.