Friday, February 24, 2012

చాన్నాళ్ల తర్వాత ఏడ్చాను...

చాన్నాళ్ల తర్వాత ఏడ్చాను... మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మసకమసగ్గా నా బాల్యం కనిపించింది. కర్ర ఊతంతో, కనిపించీ కనిపించని చూపులతో మా ఇంటివైపు నడిచొచ్చే మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మామ వాళ్లింట్లో కోళ్ల గంపల కింద నుంచి గుడ్లు పగులగొట్టి తాగిన రోజులు గుర్తొచ్చాయి. మందలించలేక నవ్విన లక్ష్మమ్మ, మా అమ్మమ్మ నవ్వు గుర్తొచ్చింది. కానీ ఆమె చావు సమయంలో ఎక్కడో దూరంగా చదువుకుంటున్న రోజులన్నీ కళ్లముందు కదిలాయి.

ది వే హోమ్... అద్భుతమైన సినిమా. ఈ మధ్య కాలంలో చూసిన ది బెస్ట్ మూవీ. కొరియన్ సినిమా. లీ జియోన్ హ్యాంగ్ దర్శకత్వంలో అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ క్యాస్టింగ్‌తో తీశారు. బహుశా ఎంత తక్కువ ఖర్చుతో సినిమా తీస్తే... అంత హృద్యంగా సినిమా తీయొచ్చేమో. ఎప్పుడో వదిలేసిన తల్లి దగ్గరకు 9 ఏళ్ల కొడుకుతో వస్తుంది కూతురు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోతుంది. దూర దేశంలో ఉద్యోగం వస్తుంది. అక్కడికి వెళ్లాలంటే కొడుకును ఏం చేయాలి. తల్లి దగ్గర కొడుకును విడిచిపెట్టి వెళ్లిపోతుంది. పూర్తి పట్టణ వాసంలో, కాస్త విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కుర్రాడు. బస్సు సౌకర్యం కూడా అంతంతమాత్రంగా ఉన్న గ్రామంలో, పూర్తిగా గ్రామీణ జీవితానికి అలవాటుపడి పండుటాకులా ఉన్న అమ్మమ్మ. వీరిద్దరి మధ్య పొంతన కుదరదు. అమ్మమ్మను చూస్తేనే అసహ్యించుకుంటాడా కుర్రాడు. కానీ అద్భుతమైన ప్రేమను పంచుతుందా అమ్మమ్మ. సినిమా సాగేకొద్దీ ఇద్దరి మధ్య ఎటాచ్‌మెంట్ పెరుగుతుంది. సినిమా చివరకు వస్తున్న కొద్దీ మన కళ్లవెంట నీటిధార మొదలవుతుంది. చివర్లో తల్లి వచ్చి కుర్రాడ్ని తీసుకెళ్లే సమయంలో మనల్ని మనం మర్చిపోతాం. చిన్నప్పుడు అమ్మమ్మ ఒడిలో కూర్చుని ఏడ్చినట్టే ఏడ్చేస్తాం. కర్చీఫ్ తీసుకోవడం కూడా మర్చిపోతాం.

సినిమా స్లోగా, కదిలించేలా సాగుతుంది. కేవలం గంటన్నర మూవీ. కుటుంబం మొత్తం కలిసి చూస్తే బావుంటుంది. ఈసినిమా కాపీ చేసి ఇంటికి తీస్కెళ్లాలి. మొన్నోసారి విహారి ఫోన్‌లో ఈ సినిమా చూడమన్నాడు. వాళ్ల తాతయ్య చనిపోయాడని చెప్తూ ది వే హోమ్ గురించి చెప్పాడు. థ్యాంక్స్ విహారి.