Wednesday, February 17, 2010

నరజాతి చరిత్ర సమస్తం అంతులేని బానిసత్వం

కొందరి స్వార్ధం మరెందరినో బానిసల్లా మారుస్తుంది. దశాబ్దాల కిందటే బానిసత్వానికీ వెట్టిచాకిరికి చరమగీతం పలికినా... అప్పుడప్పుడూ
మనిషిలోని  కృూరనైజం తిరిగి... తలెత్తి నవ్వుతోంది. నాగరికత రధచక్రాల కిందపడి... కాలగర్భంలో కలిసిందనుకున్న బానిసత్వం బతికే ఉందనడానికి గల్ఫ్ బతుకులే సాక్ష్యం.
మనిషి తాను దర్జాగా బతకడానికి మరెందరినో వంచిస్తాడు... అవసరమైతే బానిసలుగా మారుస్తాడు. యజమానిగా మారాక తనలో పైశాచిక ప్రవృత్తిని నిద్రలేపుతాడు. పొట్టచేతబట్టుకుని గల్ఫ్ కెళ్లే ఎందరో ఇలాంటి రాక్షసులచేతిలో బలవుతున్నారు. 30మందికి పైగా ఉండే అక్కడి ఇళ్లకు ఒక్కరే పనిమనిషంటేనే... పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతుంది. దేశంకాని దేశం... అర్ధంకాని భాష, దీనికితోడు ఇస్లామిక్ ఛాందసవాదం... అక్కడికి పొట్టచేతపట్టుకుని వెళ్లేవారి పాలిట అశనిపాతంగా మారుతున్నాయి. కువైట్ బానిసకూపాల్లో భారతీయులే కాదు.... అన్ని ఆసియా దేశాలకు చెందినవారూ ఉన్నారు.
ఉపాధి అనేకంటే...మెరుగైన జీవితం అన్న ఆశే  ఎందరినో గల్ప్‌కు నడిపిస్తుంది. ఉపాధి వెతుక్కుంటూ అక్కడికి వెళ్తున్నవారిని ఇక్కడి ఏజంట్లు దారుణంగా మోసం చేస్తుంటే.. అక్కడి యజమానులు చూపించే నరకం వర్ణనాతీతం. కాల్వమాధవి, పాలకొల్లు లక్ష్మి, రాజంపేట నాగమణి, సావిత్రి,  కుమారి.. వీరంతా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు. వీరందరినీ ఒకే వేదికపై చేర్చిన నేపథ్యం మాత్రం ఒకటే. భర్త నిరాదరణకు గురైనవారు ఒకరైతే....కట్టుకున్నవాడు దూరమై బాధ్యత మీదపడినవారు మరొకరు, కుటుంబానికి పెద్దదిక్కుగా బాధ్యత తీసుకున్నవారు ఇంకొకరు... తమ బతుకుల్లో వెలుగునింపుకోడానికి కనిపించిన దారినల్లా వెతికారు. తెలిసినవారు గల్ఫ్‌లోనైతే కాసిని డబ్బులు వెనకేసుకోవచ్చన్నారు.  ఆరాతీస్తే బంధువుల్లోనే కువైట్ ఏజంట్లున్నారు. ఇంకేం అందినకాడికి అప్పులు చేసి కువైట్ ఫ్లైట్ ఎక్కారు. తమ బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయని కలలుకంటూ కువైట్ చేరారు. వెళ్లిన పదినెలల్లోనే ముగ్గురు యజమానులు మారారు. ఏంజరిగేది వీరికి నామమాత్రంగానైనా తెలిసేదికాదు. రోజుకు ఇరవై గంటల గొడ్డుచాకిరి. ఇంటికి ఫోన్ చేసుకోవాలంటే నెలకోసారే అవకాశం. ఉద్యోగం పేరుతో బానిసకూపంలో పడ్డామని తెలుసుకునేసరికి చాన్నాళ్ళు గడిచాయి. బానిసల్లా పనిచేశాక, తీరా జీతం డబ్బులు ఇమ్మంటే పోలీసులొచ్చారు. వీసా పాస్‌పోర్టు లాక్కొని జైల్లో పడేశారు. ఎలాగోలా విదేశాంగశాఖను సంప్రదిస్తే... రెస్పాన్సే లేదు. ఆరునెలల నరకయాతన తర్వాత హెచ్.ఎం.టి.వి చొరవతో బైటపడ్డారు. వీళ్లని గల్ఫ్‌కి పంపించింది తెలిసినవాళ్ళే... వాళ్ల స్వార్ధానికి వీళ్లని తెగనమ్మేశారు. ఇదో సరికొత్త బానిస దళారీతత్వం. గల్ఫ్ వెళ్ళాలను కునేవారి దగ్గర ఇక్కడ డబ్బులు వసూలు చేస్తారు. తీరిగి అక్కడ మరో కంపెనీకి అమ్మేస్తారు. కనీసం వీసా పాస్‌పోర్టు అయినా ఒరిజినలా అంటే అసలు దగా అక్కడే మొదలయిందని సంగతి, అంతంతమాత్రం చదువుకున్న వీరికి తెలిసే అవకాశమే లేదు. ఇదంతా కొత్తగా మొదలయిందా అంటే.... దశాబ్దాలుగా జరుగుతున్నదే. తెలంగాణ ఉద్యమానికో, వలసబతుకులకో ముడిపెట్టి పబ్బం గడుపుకునే నేతలు సమస్య పరిష్కారానికి చేసింది శూన్యం.
బానిసత్వం గల్ఫ్‌లోనే ఉందా... బానిసల్లా వెళ్తున్నవారు అంతంతమాత్రమే చదువుకున్నవాళ్ళేనా... కానేకాదు.  సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోనూ, ఔట్ సోర్సింగ్ పేరుతో జరిగేదీ ఇదే.. కాకుంటే కాస్ట్‌లీ స్లేవరీ.. ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఇండియన్, అమెరికన్ విషయంలోనే ఇది స్పష్టమవుతోంది. వారి టార్గెట్ వర్క్‌లో తేడా చూస్తే మనకి క్లియర్ విజన్ కనబడుతుంది. శతాబ్దాల చరిత్రున్న మన బానిసబతుకులకు స్వాతంత్ర్యం లుక్ మార్చింది. నరజాతి చరిత్ర సమస్తం అంతులేని బానిసత్వం...